Header Ads Widget

Chandrayaan-3: ల్యాండర్‌ తీసిన జాబిల్లి తొలి ఫొటోలు.. షేర్‌ చేసిన ఇస్రో

 

Chandrayaan-3: ల్యాండర్‌ తీసిన జాబిల్లి తొలి ఫొటోలు.. షేర్‌ చేసిన ఇస్రో


బెంగళూరు: జాబిల్లి (Moon)పై పరిశోధనల కోసం రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 (Chandrayaan-3) లక్ష్యం దిశగా విజయవంతంగా పయనిస్తోంది. చంద్రుడి కక్ష్యలో సొంతంగా పరిభ్రమిస్తున్న ల్యాండర్‌ విక్రమ్‌ (Vikram Lander).. జాబిల్లి ఉపరితలం ఫొటోలను తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను ఇస్రో ఎక్స్‌ (ట్విటర్) వేదికగా షేర్‌ చేసింది.




చంద్రయాన్‌-3 వ్యోమనౌకలో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ (Lander Module) గురువారం విడిపోయిన తర్వాత కొద్దిసేపటికే ఈ ఫొటోలను తీసినట్లు ఇస్రో వెల్లడించింది. ఇందులో జాబిల్లి ఉపరితలంపై బిలాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆ బిలాల పేర్లను కూడా ఇస్రో (ISRO) వెల్లడించింది. ఫ్యాబ్రీ, గియార్డనో బ్రునో, హర్కేబి జే తదితర వాటి ఫొటోలను ల్యాండర్ తీసింది. ఇందులో గియార్డనో బ్రునో జాబిల్లిపై ఇటీవలే గుర్తించిన అతిపెద్ద బిలాల్లో ఒకటి. ఇక హర్కేబి జే బిలం వ్యాసం దాదాపు 43 కి.మీలు ఉన్నట్లు తెలుస్తోంది.


 మరింత చేరువైన ల్యాండర్‌..




చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ల్యాండర్‌ మాడ్యూల్‌ (Lander Module) జాబిల్లికి మరింత చేరువైంది. శుక్రవారం సాయంత్రం చేపట్టిన డీబూస్టింగ్‌ (వేగాన్ని తగ్గించే) ప్రక్రియ విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడించింది. ల్యాండర్‌ (విక్రమ్‌), రోవర్‌ (ప్రజ్ఞాన్‌)తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌ ఆరోగ్యంగానే ఉందని తెలిపింది. 


తాజా విన్యాసంతో ల్యాండర్‌ మాడ్యూల్‌ తన కక్ష్యను 113 km x 157 km తగ్గించుకుంది. రెంబో బూస్టింగ్‌ (Deboosting) ప్రక్రియ ఆగస్టు 20న తెల్లవారుజామున 2 గంటలకు చేపట్టనున్నట్లు తెలిపింది. రెండో విన్యాసం తర్వాత ల్యాండర్‌ మాడ్యూల్‌ జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువ కానుంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న సాయంత్రం దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ కాలుమోపనుంది.


👉Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/F5dk6UJty3HF1ZK2q1xAEr

Post a Comment

0 Comments