Header Ads Widget

రేపు 4-5-23 అనన్య భక్తురాలు తరిగొండ వేంగమాంబ జయంతి

 

తరిగొండ వేంగమాంబ జయంతి



కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు. భక్తుల పాలిట కల్పతరు ఆ స్వామి. భక్తి ధనిక పేద అన్న తారతమ్యం లేదు. ఆర్తితో ఎవరు పిలిచినా చాలు నేనున్నానంటూ అభయ మిస్తాడు ఆ అలివేలిమంగేశ్వరుడు. అన్నమయ్య , ఆళ్వార్లు , హాతీరామ్‌ బాబా ఇలా ఎందరో భక్తులు స్వామి సేవలో తరించి కైవల్యాన్ని పొందారు. అలాంటి వారిలో ఒకరు శ్రీ తరిగొండ వేంగమాంబ.


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రాభవాన్ని లోకానికి చాటిన భక్తుల్లో శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య తరువాత చెప్పుకోదగిన వారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ఈమె జీవితం మొత్తాన్ని స్వామివారి సేవలోనే గడిపారు. వివాహం జరిగి వైధవ్యం పొందినా శ్రీవారినే తన భర్తగా ప్రకటించి ముత్తయిదువుగా ఉండేవారు. యోగినిగా , భక్త కవయిత్రిగా వెంగమాంబ చరిత్రలో సాహితీ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.


తరిగొండ వెంగమాంబకు సుమారుగా 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి కొలువుకు చేరినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అంతవరకు ఎన్నో ఒడిదుడుకులకు లోనైన వెంగమాంబకు తిరుమల వాతావరణం మరో లోకంలా అనిపించింది. ఊహ తెలిసినప్పటి నుండి శ్రీ వేంకటేశ్వరస్వామివారినే సర్వస్వంగా భావించిన ఆమెకు స్వామివారి సన్నిధికి చేరడం పరమానందం కలిగించింది. అప్పటికే వెంగమాంబకు బాల్య వివాహమైంది. ఆమె భర్త ఇంజేటి వేంకటాచలపతి మానసిక వ్యధతో అప్పటికే మరణించారు.


తిరుమలకు చేరుకున్న వెంగమాంబ రోజంతా ఆలయం వద్దే ఉండేవారు. సాయంత్రం అయ్యేసరికి అప్పట్లో ఉన్న వెయ్యి కాళ్ల మండపానికి చేరుకునే వారు. అక్కడ యోగం చేస్తూ , స్వామివారిపై పాటలు పాడుతూ ఉండేవారు.


అమ్మవారి ప్రోద్బలంతోనే అప్పట్లో హథీరాంజీ మఠాధిపతిగా ఉన్న ఆత్మారాం దాస్‌జి శ్రీవారి భక్తురాలైన వెంగమాంబకు తిరుమలలో ఆశ్రయం కల్పించారు. ఇంటికి ఎదురుగా ఒక చింత చెట్టు ఉండేది. ఇంటి పరిసరాల్లో తులసి మొక్కలను పెంచి ప్రతిరోజూ స్వామివారికి తులసిమాలలు సమర్పించేవారు. ఈ పూరిల్లు ఉన్న స్థానంలోనే ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద కేంద్రాన్ని తితిదే నిర్మించింది.


వెంగమాంబ చాలాకాలం ఎవ్వరికీ కనిపించ కుండా శేషాచల అభయారణ్యంలోని తుంబురుకోనకు వెళ్లిపోయారు. అక్కడ వెంగమాంబ గవి అనే ప్రాంతంలో ఐదేళ్లు తపస్సు చేశారు. తిరుమలలో వెంగమాంబ కనిపించకపోవడంతో అందరూ ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోయిందని భావించారు.


అనంతరం జరిగిన పరిణామాల తరువాత వెంగమాంబ తిరిగి వచ్చేశారు. అప్పటికే ఆమె యోగినిగా , భక్త కవయిత్రిగా ప్రసిద్ధి చెందారు. కొన్ని గ్రంథాలను కూడా రచించారు.


ఇదిలా ఉండగా *ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పురస్కరించుకుని పది రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ అన్నదానం చేసేవారు.* అప్పటి గోల్కొండ నుండి తమిళనాడులోని దిండిగల్‌ వరకు ఉన్న ఆంధ్రులు తిరుమల సందర్శనకు వచ్చినపుడు అన్నదానం నిమిత్తం వెంగమాంబకు దానపత్రాలు రాసిచ్చారు. ఇప్పటికీ 30 నుండి 40 వరకు దానపత్రాలున్నాయి. అంతేగాక అప్పటి సంస్థానాధీశులు , జమిందార్లు , పాళెగాళ్లు , సామాన్య ముస్లిం సోదరులు అన్నదానానికి విరాళాలు ఇచ్చేవారు. ఈ విధంగా నిరంతరం శ్రీవారి భక్తులకు అన్నదానం చేయడం వల్ల వెంగమాంబ *”మాతృశ్రీ”* అయ్యారు.


ఇక స్వామివారి సన్నిధిలో వెంగమాంబ ప్రవేశపెట్టిన ముత్యాలహారతికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతిరోజు శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవలో ఈమె హారతి ఇచ్చేవారు. ఇందుకు అభ్యంతరం ఎదురుకావడంతో ఒకరోజు ఇంటి వద్దనే స్వామివారికి హారతి ఇచ్చి తృప్తి చెందారు. మరుసటి రోజు శ్రీవారికి రథోత్సవం నిర్వహించగా వెంగమాంబ ఇంటి వద్దకు వచ్చేసరికి రథం ఆగిపోయింది. విషయాన్ని గుర్తించిన మహంతు హారతి ఇవ్వాలని వెంగమాంబను ప్రార్థించాడు. ఆమె హారతి ఇవ్వడంతో అక్కడినుండి రథం కదిలింది. అప్పటినుండి శ్రీవారి ఆలయంలో మత్స్య , కూర్మ , వరాహ , నారసింహ తదితర అవతారాలను పళ్లెంలో వెండి ముత్యాలతో తీర్చిదిద్ది హారతి ఇచ్చేవారు. అనంతరం *”తాళ్లపాకవారి లాలిపాట.. వెంగమాంబ ముత్యాలహారతి”* అని ప్రసిద్ధి చెందింది


అప్పటికే శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు పలు రచనలు చేసిన వెంగమాంబ వద్ద అష్టఘంటములు అనే 8 మంది ఉండేవారు. వీరు ఈమె రచనలను కాపీలుగా రాసి పండితులు , భాగవతులు లాంటివారు అడిగినపుడు ఇచ్చేవారు. వెంగమాంబ తన రచనలన్నింటినీ బృందావనంలో చేసేవారు. శిష్యులు కూడా అక్కడే ఉండి ఆమె వద్ద యోగం , సాహిత్యం తదితర విషయాలను అభ్యసించేవారు. 1730వ సంవత్సరంలో జన్మించిన వెంగమాంబ రాఘవేంద్రస్వామి , వీరబ్రహ్మేంద్ర స్వామివారి లాగా తన బృందావనంలోనే 1817లో సజీవ సమాధి చెందారు.🙏🏻


వేంగమాంబ బృందావనం (సమాధి) మీరు దర్శించుకోవాలి అంటే వరాహ స్వామి కోవెలకు ఎదురుగా ఉన్న గ్యాలరీ మెట్లు ఎక్కి తారు రోడ్డుపైకి చేరుకుని కొద్దిగా ముందుకు వెళితే టీటీడీ కాన్వెంట్ ఉంటుంది అందులోనే తరిగొండ వేంగమాంబ బృందావనం ఉంది ప్రస్తుతం దీన్ని టీటీడీ వారు అభివృద్ధి చేస్తున్నారు.

Post a Comment

0 Comments