Header Ads Widget

2000 note ban news in telugu today | Rs 2000 Note Ban

 

2000 note ban news in telugu today | Rs 2000 Note Ban




₹2 వేల నోట్లు ఇప్పుడు వాడుకోవచ్చా? ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చా? :


ముంబయి: రూ.2వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. కస్టమర్లకు ఈ నోట్లను ఇవ్వవద్దని బ్యాంకులకు సూచించిన ఆర్‌బీఐ.. తమ వద్ద ఉన్న నోట్లను సెప్టెంబర్‌ 30లోగా మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. అయితే, నోట్లు ఉపసంహరణపై ప్రజల్లో నెలకొనే పలు ప్రశ్నలు/సందేహాలకు ఆర్‌బీఐ సమాధానాలు ఇచ్చింది.


1.ఎందుకు రూ.2వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకుంటోంది?


◼️ఆర్‌బీఐ చట్టం-1934లోని సెక్షన్‌ 24(1) ప్రకారం రూ.2వేల నోటును ప్రవేశపెట్టాం. పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల డిమాండుకు సరిపడా కరెన్సీని మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకే ఈ నోటును తీసుకొచ్చాం. మార్కెట్‌లో అవసరమైన కరెన్సీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. 2018-19లోనే రూ.2వేల నోటును ముద్రించడం నిలిపివేశాం. ప్రస్తుతం చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లన్నీ మార్చి 2017కు ముందు ముద్రించినవే. వాటి జీవితకాలం 4-5ఏళ్లు మాత్రమే.


2. రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుందా?


◼️అవును. రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుంది.


3. సాధారణ లావాదేవీలకు ఈ నోట్లను ఉపయోగించవచ్చా?


◼️వినియోగించొచ్చు. రూ.2వేల నోటును సాధారణ లావాదేవీలకు ప్రజలు ఉపయోగించుకోవచ్చు. వాటిని స్వీకరించవచ్చు కూడా. అయితే, 2023 సెప్టెంబర్‌ 30లోగా ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేయడం లేదా మార్చుకోవడం చేయాలి.


4. రూ.2 వేల నోటు కలిగి ఉన్నవారు ఏం చేయాలి?


◼️రూ.2 వేల నోటు ఉన్నట్లయితే బ్యాంకుకు వెళ్లి వాటిని తమ అకౌంట్లో డిపాజిట్‌ చేయడమో లేదా మార్చుకోవడమో చేయాలి. అయితే, ఈ సదుపాయం 2023 సెప్టెంబర్‌ 30వరకు ఉంటుంది. అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.


5. బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేసుకోవడంపై ఏదైనా పరిమితి ఉందా?


◼️బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేసుకోవడంపై ఎటువంటి ఆంక్షలూ లేవు. కేవైసీ, ఇతర నిబంధనలను అనుసరించి వాటిని డిపాజిట్‌ చేసుకోవచ్చు.


6. రూ.2 వేల నోటు మార్చుకునేందుకు ఏమైనా పరిమితులు ఉన్నాయా?


◼️ప్రజలు ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది.


7. ఈ నోట్లను బిజినెస్‌ కరెస్పాండెంట్‌ (బీసీ)లతో మార్చుకోవచ్చా?


◼️మార్చుకోవచ్చు. అయితే, బ్యాంకుల్లో ఉండే బిజినెస్‌ కరెస్పాండెంట్‌ల నుంచి రోజుకు కేవలం రూ.4వేలు మాత్రమే మార్చుకోవచ్చు.


8. ఏ తేదీ నుంచి నోట్లను మార్చుకునే అవకాశం అందుబాటులో ఉంటుంది?


◼️2023 మే 23 నుంచి మాత్రమే ఈ నోట్లను మార్చుకునే వీలుంటుంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యాంకులు ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ గడువు ఇవ్వడం జరిగింది.


9. అకౌంటు ఉన్నవారు అదే బ్రాంచీలో మార్చుకోవాలా?


◼️లేదు. ఏ బ్యాంకులోనైనా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక బ్రాంచీలో ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది.


10. ఎవరికైనా రూ.20వేలకంటే ఎక్కువ అవసరమైతే ఏం చేయాలి?


◼️డిపాజిట్‌పై ఆంక్షలు లేవు. రూ.2వేల నోట్లు ఎన్ని ఉన్నా తమ అకౌంట్లో డిపాజిట్‌ చేయవచ్చు. అనంతరం తమ అవసరానికి అనుగుణంగా వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు.


11. నోట్లను మార్చుకోవడానికి అదనంగా ఏమైనా చెల్లించాలా?


◼️లేదు. నోట్ల మార్పిడి పూర్తిగా ఉచితం


12. వయోవృద్ధులు, వికలాంగుల కోసం బ్యాంకుల్లో ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయా?


◼️వయోవృద్ధులు, వికలాంగులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు సూచించాం.


13. తక్షణమే రూ.2వేల నోటును డిపాజిట్‌ చేయకుంటే ఏమవుతుంది?


◼️ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా నాలుగు నెలల సమయం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన గడువులోగా వాటిని డిపాజిట్‌ చేయడమో లేదా మార్చుకోవడమే చేయాలని సూచిస్తున్నాం.


14. రూ.2వేల నోటును తీసుకునేందుకు బ్యాంకు నిరాకరిస్తే ఏం చేయాలి..?


◼️సేవల్లో ఏదైనా లోపం జరిగితే వినియోగదారుడు తొలుత బ్యాంకు అధికారులను సంప్రదించాలి. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా బ్యాంకు స్పందించకపోవడం లేదా బ్యాంకు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే రిజర్వు బ్యాంకు-ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ (RB-IOS), 2021 కింద ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.

Post a Comment

0 Comments