Header Ads Widget

మరో జాబ్ క్యాలెండర్ ? - జగన్ సర్కార్ సంకేతాలు- మరిన్ని ఉద్యోగాలు

ఏపీలో వైసీపీ సర్కార్ ఎన్నికల హామీల్లో భాగంగా రెండేళ్ల తర్వాత ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు, విపక్షాలు ఏకమవుతున్న వేళ ఇందులో మార్పులు చేపట్టేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్యపై ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని మరింత పెంచి కొత్త క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా సంకేతాలు ఇచ్చారు.


             


జాబ్ క్యాలెండర్ సెగ :
ఏపీలో వైసీపీ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను మెప్పించలేకపోయింది. దీనికి ప్రధాన కారణం అరకొర ఉద్యోగాలే. విభజన తర్వాత నష్టపోయిన రాష్ట్రానికి కొత్తగా భారీ స్ధాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్ధితి లేకపోవడం, విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలోనూ వివిధ కారణాలతో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో ఈ జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అదీ సీఎం జగన్ ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ చేసిన ప్రకటన వారిలో ఆశలు నింపింది. చివరికి విడుదలైన జాబ్ క్యాలెండర్ లో ఆ మేరకు ఉద్యోగాలు లేకపోవడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి.

 

పునరాలోచనలో జగన్ సర్కార్ : 
అట్టహాసంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ విఫలం కావడంతో జగన్ సర్కార్ పునరాలోచనలో పడింది. అసలే ఖజానా సహకరించని పరిస్ధితుల్లో ఎన్నో కొన్ని ఉద్యోగాలతో క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా మరో ఎన్నికల హామీ నెరవేరిందన్న సంతోషం వైసీపీ సర్కార్ కు లేకుండా పోతోంది. దీంతో జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇందులో మార్పులు చేర్పులు చేసి కొత్తగా మరో క్యాలెండర్ విడుదల చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ మేరకు త్వరలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.


 
మార్పులపై తమ్మినేని సంకేతాలు : 
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం జాబ్ క్యాలెండర్ పై నిరసనలపై తాజాగా స్పందించారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేస్తుందని, మార్పులు చేర్పులు ఉంటాయని ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పారు. స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని వ్యాఖ్యలు ఇప్పుడు నిరుద్యోగుల్లో ఆశలు నింపుతున్నాయి. దీంతో జాబ్ క్యాలెండర్ లో ఉండే మార్పులపై నిరుద్యోగుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రభుత్వం దీనిపై ఎప్పుడు ప్రకటన చేస్తుందన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.


  కొత్తగా మరిన్ని ఉద్యోగాలతో కొత్త క్యాలెండర్ :
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు మాత్రం రాష్ట్ర ఖజానా సహకరించని పరిస్ధితి. దీంతో ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో ప్రతీ శాఖలో లేదా, ప్రాధాన్యత ఉన్న శాఖల్లో మరికొన్ని ఉద్యోగాలను చేర్చి కొత్త క్యాలెండర్ ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో కాకపోయినా నిరుద్యోగుల్ని మెప్పించేలా ఇది ఉండొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా దీన్ని రాజకీయానికి వాడుకుంటున్న విపక్షాలకు చెక్ పెట్టేలా జాబ్ క్యాలెండర్ ఉండే అవకాశముంది.


Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇



Post a Comment

0 Comments